కొన్ని తెలుగు సాంకేతిక పదాలు

త్రిప్పెన – screw-driver
నెజ్జనుడు – netizen
నెజ్జని – woman netizen
పేజీక – bookmark
పేజీకపెట్టు – to bookmark
అమరికలు – settings
అంతర్జాలం – internet
అంతర్జాల సంధానం – internet connection
విహరిణి – browser
వేగు – Email
వేగుపంపు – to mail
వేగరి – mailer
సేవాకర్త – service provider
పూర్వాయత్తం – readymade
ఋణరేకు – credit card
ఖాతారేకు – debit card
ఎఱుకజేయు – to acknowledge
ఎఱుకజేత – acknowledgement
నాణెకం – currency
సార్థవాహం – company
సార్థవాహికం – corporate
వృత్తినిపుణం – professional
పొడి అక్షరాలు – abbreviation
ప్రత్యాహారం – abbreviation
పొడిమాట – acronym
ఆకరం – source
వనరు – resource
మూలం – original
మౌలికత – originality
మృదుసామాను/మృదుసామగ్రి – software
పటుసామాను/పటుసామగ్రి – hardware
మార్గించు – to route
చెల్లింపు – payment
తఱచుట – to browse
స్వరూపించు – to configure
స్వరూపణం – configuration
ప్రక్రియ – process
ప్రక్రియాపనం – processing
ప్రక్రియాపని – processor
ప్రక్రియాపకం – processor

ఐ.పి.గోపని – I.P.hiding software
ఐ.పి.వేత్రి – I.P.finder
ప్రత్యేకించు – to reserve
కేటాయించు – to allot
కేటాయింపులు – allotments

ప్రత్యేకింపులు – reservations
ప్రత్యేకితం – reserved
అవసర దళాలు – reserve forces

ఎంపికచేయు – select
ఎంపిక – selection, choice
పర్యాప్తం – optimum
పర్యాప్తించు – optimize
పర్యాప్తింపు – optimization
లాగుపట్టె – scroll bar
ఎగలాగు – scroll up
దిగలాగు -scroll down
ఎగసాచు – zoon in
దిగసాచు – zoom out
మొగ్గించు – skew
టపా – post
టపాచేయు – to post
కత్తిరింపు-నకలు-అతుకు పని = cut-copy-paste job
గద్య – paragraph
ఖతి – font
పరిమాణం/కొల – size
పట్టీ – menu
జాబితా – list
పట్టిక – table
జాతీయం, నుడికారం – idiom
శబ్దపల్లవం – phrasal verb
పదబంధం – phrase
ప్రస్తావన – topic
ఉద్ఘాటన – statement
చర్చాహారం – thread
జ్ఞాపక జాగా – memory space
పెద్దగించు – maximize, enlarge
చిన్నగించు- minimize
సైజుమార్చు/కొలమార్చు – resize
ఆమ్రేడించు – repeat
నిలుపు – pause
ఆపు – stop
నమోదు – record
నమోదు చేయు – to record
దృశ్యకం – video
శ్రవ్యకం – audio
ఆతిథేయ గూడు – host site
స్థాపించు – install
వినిపించు/ప్రదర్శించు – play
వడియం – chip
ఆపుచేయు – turn off
కొసర్లు, చేర్పులు – add-ons
నొక్కు – click
లంకె – link
సంతకించు – sign up
లోసంతకించు – sign in
వెలిసంతకించు – sign out
జమిలినొక్కు – to double-click
కుడినొక్కు – right-click
చెఱుపు – delete
మీటలు – keys
మీటకం/మీటల ఫలకం – keyboard
బొత్తాం/గుండీ – button
ప్రతిదర్శిని – monitor
సన్నాహక కసరత్తు – preparatory exercise

అంతర్జాల నెలవు – web portal
అంతర్జాల అనుసంధానం – Internet connection
అంతరవర్తి – interface
అజ్ఞాత విహరణం – anonymous surfing
సాలెగూటి సరఫరా – site feed

తెఱపట్టు – screen-capture
తీర్చిదిద్దుకొను – customize
తీర్చిదిద్దుకోలు (కైసేత) – customization
అందగించు – beautify
అందగింపు – beautification
ఎక్కించు – to upload
ఎక్కింపు – upload
దించుకొను – to download
దింపుకోలు – download
జోడించు – to attach
జోడింపులు – attachments
సవరణ – modification
సంప్రకారం – format
సంప్రకారించు – formatting
ప్రతీకం – icon
లావాటి అక్షరాలు – bold
వాలు అక్షరాలు – italics
సాదా అక్షరాలు – normal
క్రీగీత – underline
అడ్డగీత/మధ్యగీత – strikethrough
సర్దుబాటు/సర్దుబడి – alignment
కదులుపట్టె – scroll-bar
పక్కపట్టె – side-bar
తీఱుతెన్నులు – features
నిరీక్షాస్థితి – standby mode
పక్కం – margin
మీదుపుట – header
క్రీపుట – footer
దస్తావేజు, కృతి – document
ప్రవర – profile

కైఫీయతులు – archives
ప్రచురించు – publish
అట్టిపెట్టు – save
పారవేయు – discard
సంకేతపదాన్ని ధ్రువీకరించు/ఖాయపఱచు – confirm password
కవిలె – file
చిట్టా – folder
దృశ్య కవిలె – video file
శ్రవ్య కవిలె – audio file
పాఠ్య కవిలె – text file
సిద్ధమౌతోంది/సన్నద్ధమౌతోంది – under process

సైపేటిక – check-box

సై/సరే – OK

నెనర్లు – thanks

కలనయంత్రం – computer

పటం – screen

సీమానామం – domain name

నమోదిత వ్యవహర్త/ వాడుకరి – registered user

జారుడు జాబితా – drop-down list

సుసంపన్న పాఠ్యం – rich text

సుసంపన్నించు – enriching

సుసంపన్నింపు – enrichment

పిడి – tab

నివేదిక – report

నివేదింపు reporting

సమ తలం – even

విషమ తలం – uneven

చర్చావేదిక – forum

ఆరోపాలు – entries

పరిసరాలు – surroundings

పదక్రమం – syntax

టపా – post (n)

టపాచేయు – to post

ప్రచురించు – publish

ఆదేశం – command

సంకేతావళి – code

సంకేతం – signal

చట్రం – frame

సరిచూడు – to check

సరిచూడ్కి – checking

ఆత్మసరిచూడ్కి – self-check

సమన్వయం – coordination

స్వంతదారీ ఖతులు – proprietory fonts

బహిరంగంగా – publicly

బాహాటం -open

బయల్పఱచు – to expose

చుట్టుచూపు – outlook

నామాంకం – label

నామాంకనం – labelling

నామాంకితం – lebelled

చేజోలె – Wallet

పేరోలగమ్ – parliament

పేరోలగ ప్రజాస్వామ్యం – parliamentary democracy

ముద్రాంకం – commercial brand

ముద్రాంకితం – branded product

ముద్రాంకనం – branding

ముద్రాంకించు – to brand something, somebody

ముద్రాంక విధేయత – brand loyalty

వలస – migration

వలసరి – migrant

వలసరాక – immigration

వలసరాకరి – immigrant

వలసపోక – emigration

వలసపోవరి – emigrant

తో…సంవదించు – to corroborate with

తాడేపల్లి బాలసుబ్రహ్మణ్యం గారి ఆలోచన

విస్తరిస్తున్న ఆధునిక విజ్ఞానానికీ వ్యవహారానికీ అవసరాలకీ అనుగుణంగా
కొత్త తెలుగు పదాల్ని కల్పించుకునేటప్పుడు కొన్ని ఆదర్శ సూత్రాల్ని
గమనంలో ఉంచుకోవాలని నేననుకుంటున్నాను.

1. కొత్త వాడుకలు అలతి అలతి పదాలతో ఏర్పఱచిన చిరుసమాసాలై ఉంటే మంచిది.
పర్యాప్తమైన చిరుతనాన్ని (optimum smallness) నిర్వచించడం కష్టం. కాని
స్థూలంగా (అ) తెలుగులిపిలో అయిదు అక్షరాలకి మించని పదాలూ (ఇ) ఒకవేళ అయిదు
అక్షరాలకి మించినా, ఆరేడు అక్షరాలు కలిగి ఉన్నా,  రెంటి కంటే ఎక్కువ
అవయవాలు లేని సమాసాలూ చిఱువాడుకలు అని భావిచవచ్చు.

2.సాఫీగా అర్థమయ్యే ఇంగ్లీషు పదాల (plain English terms)కి విశేషణాల
(adjectives)తో కూడిన వర్ణనాత్మక పదజాలాన్ని సృష్టించడానికి పూనుకోకూడదు.
అలాంటి ప్రయత్నం సాధారణంగా కొండవీటి చాంతాడంత సమాసాలకి దారితీస్తుంది.
Loan translation (అంటే మూలభాషలోని అర్థాన్ని మనం భాషలోకి అనువదించి
పదాలు కల్పించడం) కొన్నిసార్లు తప్పదు. కాని అన్ని వేళలా అదే మంత్రం
గిట్టుబాటు కాదు. బ్లాగ్ లాంటి పదాల్ని “దాదాపుగా” అలాగే ఉంచి తత్సమాలుగా
వాడుకోవడం మంచిది.

3. తెలుక్కి స్వాభావికమైన జాతీయాన్ని నుడికారాన్ని (idiom)
భ్రష్టుపట్టించకూడదు. తెలుగులో ఇమడని నిర్మాణాలు (structures)శీఘ్రంగా
పరమపదిస్తాయని మఱువరాదు.

4. భాషా పరిశుద్ధతని నిలబెట్టడం మన లక్ష్యం కాదు. భాషని సుసంపన్నం
చెయ్యడం, ప్రయోగాత్మకతని ప్రోత్సహించడం మన లక్ష్యం. కాబట్టి వైరి
సమాసాల్ని మిశ్రసమాసాల్ని విరివిగా అనుమతించాలి. అయితే అవి శ్రవణ సుభగంగా
(వినసొంపుగా) ఉంటేనే పదికాలాల పాటు నిలుస్తాయి. వికారమైన కాంబినేషన్లది
అల్పాయుర్దాయం. తప్పనిసరై దిగుమతి చేసుకున్న ఇంగ్లీషు పదాలకి సంస్కృత
ప్రత్యయాల (suffixes)నీ,  ఉపసర్గల (prefixes) నీ చేర్చి వాడుకోవడం
అమోదయోగ్యమే. ఉదా : కర్బనీకరణ మొదలైనవి.

5. ఇంగ్లీషులో లాగే తెలుగులో కూడా ప్రత్యాహారాల (abbreviations) ద్వారా
ఏర్పడే acronyms ని (వెకిలిగా పరిగణించకుండా) వాటికి ఒక గౌరవనీయ
స్థానాన్ని కల్పించడం చాలా అవసరం. తెలుగులో ఇప్పటికే అలాంటివి కొన్ని
ఉన్నాయి.

ఉదా :-అ.ర.సం (అభ్యుదయ రచయితల సంఘం)
వి.ర.సం (విప్లవ రచయితల సంఘం)
సి.కా.స (సింగరేణి కార్మిక సమాఖ్య)

వీటి సంఖ్య ఇంకా ఇంకా పెరగాలి. ముఖ్యంగా తెలుగు శాస్త్ర సాంకేతిక
రంగాల్లో !

6. మిశ్ర పద నిష్పాదన (hybrid coinage)ని ప్రోత్సహించాలి. అంటే, ఒక భాషకి
చెందిన ఉపసర్గల్నీ ప్రత్యయాల్నీ ఇంకో భాషకి చెందిన దేశి పదాలకి చేర్చి
కొత్త పదాలు పుట్టించడం. ఉదాహరణకి :- దురలవాటు. ఇందులో “దుర్” అనే ఉపసర్గ
సంస్కృతం. “అలవాటు” తేట తెలుగు పదం. ఇలాంటివే నిస్సిగ్గు, ప్రతివాడు, అతి
తిండి మొదలైనవి. ఇలాంటివి చాలా ఉన్నాయి కాని సరిపోవు. ఇవి వందలుగా వేలుగా
పెరగాలి.

7. అన్నింటి కంటే ముఖ్యమైన విషయం ఒకటుంది. పాత పదాలు,  కావ్యభాష,
గ్రాంధికం అంటూ కుహనా అభ్యూదయ లేబుళ్ళు వేసి మనం నిర్దాక్షిణ్యంగా
త్రోసిపుచ్చిన అచ్చ తెలుగు పదజాలం అపారంగా ఉంది. అలాగే అలాంటి సంస్కృత
పదజాలం కూడా విపరీతంగా ఉంది.

అభ్యూదయపు చీకటి కోణం
అట్టడుగున పడి కాన్పించని
పదాలన్నీ కావాలిప్పుడు
దాగేస్తే దాగని భాష (శ్రీ శ్రీకి క్షమాపణలతో)

ఆ పదజాలాన్నంతా ఇప్పుడు వెలికి తీయక తప్పదు. ఈ సందర్భంగా ప్రాచుర్యంలోకి
వచ్చిన కొన్ని దురభిప్రాయాల్ని కూడా సవరించాలి.

తెల్ల దేశాల్లో వారికి తెలిసిన plain language, layman’s vocabulary అనే
పదాలకి అర్థం వేరు. మన దేశంలో layman’s language కి అర్థం  వేరు. అక్కడి
layman’s language మన layman’s language కంటే అత్యంత సంపన్నమైనది.
శక్తిమంతమైనది కూడా. మన దేశంలో వాడుకలో ఉన్న layman’s language ఒక చచ్చు
భాష, బీద భాష కూడా. ఇందులో పదాలు కొద్ది. వ్యక్తీకరణలు పూజ్యం. మన laymen
కనీసం ఐదో తరగతి వరకైనా చదివినవారు కాకపోవడం ఇందుకో కారణం. పదో తరగతి
వరకు చదివిన వారిక్కూడా పుస్తక పఠనాసక్తి లేకపోవడం మరో కారణం. కాబట్టి
అలాంటివారిని దృష్టిలో పెట్టుకుని మనం కొత్త పదజాలాన్ని రూపొందించడానికి
పూనుకోకూడదు. అలా పూనుకుంటే తెలిసిన పదాల గుడుగుడుగుంచంలోనే తిరగాల్సి
వస్తుంది.

తెలుగులో కొత్త పదాల కల్పన చేసేటప్పుడు ఇంగ్లీషు పదాల్ని మక్కికి మక్కి
దించుకోవడమో, అనువదించడమో కాక, ఇంగ్లీషులో పదాలు ఏర్పడిన విధానాన్ని
ముందు సమగ్రంగా అధ్యయనం చేసి ఆ పద్ధతుల వెలుగులో తెలుక్కి వర్తించే
సూత్రాల్ని ఏర్పఱచుకోవాలి. నా పరిశీలనలో ఇంగ్లీషు పదాలు చారిత్రికంగా
స్థూలంగా రెండు రకాలుగా ఏర్పడ్డాయి.

1. అచ్చ ఇంగ్లీషు పదాలు  2. ఆదానాలు.

అచ్చ ఇంగ్లీషు పదాలు నాలుగు రకాలుగా ఏర్పడ్డాయి.

(అ) జెర్మానిక్ పదాలు :- తోటి జెర్మానిక్ భాషలైన డచ్, జర్మన్ భాషలతో
పోలికలు గల ఇంగ్లీషు పదాలివి. ఉదా :- friend, thanks, good, God, church,
round, free మొదలైనవి.

(ఇ) ఆంగ్లో-శాక్సన్ పదాలు :- మొదట్లో Angles అని పిలవబడ్డ ఆదిమ ఇంగ్లీషు
వలసదార్లు ఇంగ్లండులోని స్థానిక శాక్సన్ జాతివారితో సమ్మేళనమై మాట్లాడ
నారంభించిన భాష.

(ఉ) కెల్టిక్/గేలిక్ పదాలు : ఇంగ్లీషుకు పరిసర భాషలైన వెల్ష్, స్కాటిష్,
ఈరిష్ భాషల ప్రభావంతో ఇంగ్లీషులోకి వచ్చి చేరిన పదాలు.

(ఎ) నోర్డిక్ పదాలు :- వైకింగులు ఇంగ్లండుని పరిపాలించిన కాలంలో వచ్చి
చేరిన పదాలు.

ఇంగ్లీషులో రెండో అతిపెద్ద శబ్దవర్గమైన ఆదాన పదాల్ని కూడా 4 రకాలుగా
వింగడించవచ్చు.

(అ) ప్రామాణిక ఆదానాలు (Learned Borrowings): సంస్కృత ప్రాకృత భాషల
పదాల్ని తెలుగు గ్రహించినట్లే  మత, మతేతర కారణాల వల్ల ముఖ్యంగా
పునరుజ్జీవన (Renaissnace) కాలంలో లాటిన్, గ్రీకు పదాలు ఇంగ్లీషుని
ముంచెత్తాయి. ఈ సంప్రదాయం ఇప్పటికీ కొనసాగుతోంది.

(ఇ) చారిత్రిక ఆదానాలు : తెలుగు ఉర్దూ రాజుల ప్రభావానికి లోనైనట్లే,
ఇంగ్లండుని నార్మన్ రాజులు పరిపాలించిన కాలంలో ఇంగ్లీషు ఫ్రెంచి
ప్రభావానికి గురైంది. ఫ్రెంచివారిని అనుకరిస్తూ ఇంగ్లీషువారు కూడా పదాల
చివర ఒక అనవసరమైన e చేర్చి రాయసాగారు. ఉదా :- wyf కాస్తా wife అయింది.

(ఉ) సామ్రాజ్య ఆదానాలు : ఇంగ్లీషువారు ప్రపంచంలోని వివిధ ప్రాంతాల్లో తమ
రాజకీయాధికారాన్ని స్థాపించినప్పుడు స్థానిక భాషలు నేర్చుకోవడం,
వాటిలోంచి అవసరమైన పదాల్ని గ్రహించడం జరిగింది.

ఇది తెలుగుని ఇంగ్లీషుతో పోల్చడానికి కాదని అర్థం చేసుకోవాలి. చాలామంది ఆ
పొఱపాటు చేస్తారు. నార్మన్ రాజుల కాలంలో తప్ప మిగతా అన్ని కాలాల్లోను
ఇంగ్లీషు ఒక దేశానికి అధికార భాషగా ఒక హోదాని వెలగబెడుతూ వచ్చింది. ఒక
దేశానికి జాతీయభాషగా రాజపోషణకీ, దాని ద్వారా ప్రజాపోషణకి అది నోచుకుంది.
అందుచేత అది ఎన్ని భాషల ప్రభావానికి లోనైనా తన అస్తిత్వానికి ప్రమాదం


రాలేదు. తెలుగు పరిస్థితి పూర్తి విరుద్ధం. విజయనగర సామ్రాజ్యం అంతరించాక
(క్రీ.శ. 1665 ప్రాంతం) ఒక అధికార భాషగా తెలుగు యొక్క అధ్యాయం
ముగిసిపోయింది. అయినా ఇప్పటి దాకా ఈ భాష బతికే ఉండడం గొప్ప సర్కస్ ఫీటే.
అందుచేత తెలుగు భాషాభిమానం భాషోన్మాదమూ కాదు. విశాలాంధ్ర భావన
సామ్రాజ్యవాదమూ కాదు.

కొందరు తలపోస్తున్నట్లుగా ఇంగ్లీషులో ఈనాడు మనకు కనిపించే పదాలు ఇతర భాషల
నుండి మక్కికి మక్కి దిగుమతి చేసుకున్నవి కావు. ఆకాశం నుంచి హఠాత్తుగా
ఊడిపడ్డవీ కావు. వాటి వెనుక ఇంగ్లీషు మేధావుల కృషి చాలా ఉంది. అలాంటి
కృషినే ఇప్పుడు మనం కూడా చెయ్యాలనుకుంటున్నాం. కొత్త పదాల రూపకల్పన
చేసేటప్పుడు ఇంగ్లీషు మేధావులు అనుసరించిన పద్ధతుల్నే మనం ఇప్పుడు
చర్చిస్తున్నాం.

1. పోలిక (Analogy) :- అంతకుముందున్న పదాలకు సంబంధించిన కొత్త పదాలు
అవసరమైనప్పుడు ఆ పదాల స్వరూపానికి కొద్దిగా మార్పులూ చేర్పులూ చేసి వేరే
అర్థంలో వాడారు. అంతకుముందు కేవలం uncanny అనే పదం ఒక్కటే ఉండగా canny
అనే పదాన్ని కల్పించారు. అంతకుముందు gnostic (ఒక ప్రాచీన క్రైస్తవ శాఖ
సభ్యుడు) ఒక్కటే ఉండగా agonstic (అజ్ఞేయవాది, నాస్తికుడు) అనే పదాన్ని
కల్పించారు. outrage అనేది అచ్చమైన ఆంగ్లో-శాగ్జన్ పదం కాగా దానికి
విశేషణంగా outrageous అని లాటిన్ శైలిలో కల్పించారు. అంటే ఉన్న పదాల
నుండే కొత్త పదాల్ని కల్పించారు. అలా కల్పించడం ఇంగ్లీషు/లాటిన్ వ్యాకరణ
సూత్రాలకు విరుద్ధమైనా లెక్కచెయ్యలేదు. సూత్రాలు వర్తింప శక్యమైతే
పాటించారు. పాటించడానికి అవకాశం లేనిచోట త్రోసిపుచ్చారు.

2. ధ్వన్యనుకరణ (Imitation) :- మనుషులు భావోద్వేగపు క్షణాల్లో చేసే
అవ్యక్త కాకుస్వరాలకూ ధ్వనులకూ శబ్ద ప్రతిపత్తిని కల్పించారు. ఆ ధ్వనులకు-
తెలిసిన ప్రత్యయాల్ని జోడించి కొత్త పదాల్ని నిష్పాదించారు. ఆ క్రమంలో
lispism, yahoo, pooh-poohing, booing మొదలైన పదాలు పుట్టాయి. మనవాళ్ళు
కూడా “చకచక, నిగనిగ” నుంచి చాకచక్యం, నైగనిగ్యం, నిగారింపు మొదలైన
పదాల్ని నిష్పాదించారు. అయితే ఈ ప్రక్రియ ఇటీవలి కాలంలో వెనకబట్టింది.

3. అర్థాంతర ప్రకల్పన (Semantic alteration):-  సాధారణ పరిస్థితుల్లో భాష
చనిపోదు. ఇసుమంత మారుతుందంతే ! ఇంగ్లీషువారు అంతకుముందున్న పదాలకే కొత్త
అర్థాల్ని అనువర్తించారు. fan, straw, (cheque)leaf, web, portal
మొదలైనవి ఈ కోవకు చెందినవి. కాని ఇలా చెయ్యాలంటే భాషా పటిమ కన్నా మనిషిలో
కొంత కవితాత్మకత తోడవ్వాలి.

4. పునరుద్ధరణ (Revival) :- భాషలో కొన్ని పదాలు బహు పాతవై ఉంటాయి. అవి
నిఘంటువులకు మాత్రమే పరిమితమై ఉంటాయి. అవి ఇప్పుడెవరూ ఏ మాండలికంలోను
వాడకపోవచ్చు. వాటికి సమానార్థకాలైన వేరే పర్యాయపదాలు ఇప్పుడు లభ్యమౌతూ
ఉండొచ్చు. అంతమాత్రాన ఆ పాత పదాలు పనికిమాలినవి కావు. ఈ సత్యాన్ని
ఇంగ్లీషువారు లెస్సగా కనిపెట్టారు. ఆ పదాల పాత అర్థాలకి సరిపోలిన కొత్త
అర్థాల్లో వాటిని వాడడం మొదలుపెట్టారు. ఆధునికంగా లభ్యమౌతున్న పదాలకు
తోడు ఈ పాత పదాలు కొత్త అర్థాల సోయగాలతో జతచేరి ఇంగ్లీషు భాషని నవయౌవనంతో
పరిపుష్టం చేశాయి. olympics, carnival, domain మొదలైనవి ఇందుకు ఉదాహరణ.

5. మాండలికాల విస్తృత వినియోగం (universalization of dialects):
ఇంగ్లీషులో ఎన్ని మాండలికాలున్నాయో ఎవరికీ అంతు చిక్కదు. అయితే
ఇంగ్లీషువారు ఆ మాండలికాలన్నింటినీ సందర్భానుసారంగా ఉపయోగించుకుని భాషని
శక్తిమంతం చేసుకున్నారు. మాండలిక పదాలకు ఇప్పటికే ఉన్న అర్థాలకి తోడు
కొత్త అర్థాల్ని జతకలిపారు. కొన్ని సందర్భాల్లో Slang నుండి సైతం
ప్రామాణిక భాషని సిద్ధం చేశారు. ఉదాహరణకి jazz అనే పదం New Orleans లో ఒక
పచ్చి అశ్లీల క్రియాధాతువుగా మాత్రమే వాడుకలో ఉండేది. అదిప్పుడు ఒక
గౌరవనీయమైన సంగీత కళారూపానికి నామధేయమైంది.

6. మిశ్ర పద నిష్పాదన (hybrid coinage) :- ఇంగ్లీషులో ఇప్పుడు
“చెయ్యదగిన” అనే అర్థంలో క్రియాధాతువుల చివర చేర్చబడుతున్న able అనేది
నిజానికి ఫ్రెంచి ప్రత్యయం. మొదట్లో ఇది adorable మొదలైన ఫ్రెంచి ఆదాన
పదాలకు మాత్రమే చేరేది. క్రమంగా దాన్ని దేశి ఇంగ్లీషు పదాలక్కూడా
యథేచ్ఛగా చేర్చడం మొదలైంది. ఈరోజు think, drink, eat, walk లాంటి అచ్చ
ఇంగ్లీషు పదాలక్కూడా ఈ విధమైన పరిణామాన్ని చూస్తున్నాం.

మన సంప్రదాయంలో సంస్కృత పదాలతో జతకలిపి తెలుగుతో సహా ఏ ఇతర భాషాపదాలకైనా
సరే సంధులూ, సమాసాలూ చెయ్యడం ఆదినుండి నిషిద్ధం. కలిసే అవయవాలు రెండూ
సంస్కృత పదాలైతేనే సంధిసమాసాలు సాధ్యం. ఆ రకంగా అవసరం లేని సంస్కృత పదాలు
కూడా తెలుగులోకి సమాసాల రూపంలో యథేచ్ఛగా చొఱబడిపోయాయి. ఒకప్పుడు
ఇంగ్లీషులో కూడా ఇలాంటి సంప్రదాయమే ఉండేది. లాటిన్ గ్రీకు పదాలతో అచ్చ
ఇంగ్లీషు పదాల్ని కలపకూడదు. అంతే కాక లాటిన్ సమాసాలు లాటిన్తో జరగాలి.
గ్రీకు సమాసాలు గ్రీకుతోనే జరగాలి. లాటిన్ పదాలతో గ్రీకు పదాల్ని
కలపకూడదు.

కాని ఆధునిక ఇంగ్లీషు మేధావులు ఈ సంప్రదాయాన్ని కావాలనే విశృంఖలంగా
ఉల్లంఘించారు. తప్పలేదు, తప్పు లేదు. ఎందుకంటే సమాసంలో రెండో పదం కూడా ఆ
భాషాపదమే అయివుండాలంటే, ఎంతమందికి లాటిన్ గ్రీకుల మీద పట్టుంటుంది ? అలా
పదసృష్టి ఆగిపోతుంది.

7. నామవాచకాల క్రియాకరణం (Verbification of nouns) : ఆధునిక ఇంగ్లీషు
అన్ని రంగాల్లోను వాయువేగ మనోవేగాలతో దూసుకుపోవడానికి ఈ చర్య
దోహదించినంతగా మఱింకేదీ దోహదించి ఉండలేదు. ఈనాటి ఇంగ్లీషులో ఏ (noun)
నామవాచకాన్నయినా సరే, క్రియాధాతువు(verb-root)గా మార్చి వాడుకునే
సౌలభ్యముంది. అసలు అవి మౌలికంగా క్రియలా ? నామవాచకాలా ? అని సందిగ్ధంలో
పడి కొట్టుమిట్టాడేటంతగా ఈ ప్రక్రియ విశ్వవ్యాప్తమైంది. ఆఖరికి
పొడిపదాల్ని కూడా క్రియలుగా మార్చేసి SMSing అని వాడుతున్నారు.

వ్యక్తినామాల (proper nouns)ని సైతం క్రియలుగా మార్చేశారు. Charles F.
Boycott అనే బ్రిటిష్ భూస్వామి అడిగినంత కూలీ ఇవ్వట్లేదని ఆయన ఎస్టేట్లో
పనిచేసే రైతుకూలీలంతా సమ్మెచేసి పనులకి దూరంగా ఉంటే, దానికి boycotting
అని పేరొచ్చింది. ఇలాంటివి మన తెలుగులో కూడా ఒకటి-రెండు లేకపోలేదు. ఉదా:-
భీష్మించడం. ఈ క్రియ తెలుగులోనే ఉంది కానీ సంస్కృతంలో లేదు.

8. సమాస ఘటనం : ఇంగ్లీషు మేధావులు గత శతాబ్దాల్లో ఉనికిలో లేని కొన్ని
వ్యాకరణ సంప్రదాయాల్ని తమ భాషలో ప్రవేశపెట్టారు. వాడుకలో బహుళ ప్రాచుర్యం
పొందినప్పటికీ ఇంగ్లీషు వ్యాకరణాల్లో మాత్రం ఆ నిర్మాణాలకు ఇప్పటికీ
సముచిత స్థానం లేదు. వాటిల్లో సమాసాలొకటి. సమాసం రెండు వేరు వేరు అర్థాలు
గల పదాలతో ఏర్పడే మిశ్రమం. ఆ మిశ్రమం నుంచి ఉప్పతిల్లే కొత్తపదం ఒక కొత్త
అర్థాన్ని కూడా స్ఫురింపజేస్తుంది. ఉదా :- రాజ భవనం. ఇది రాజు కంటే, భవనం
కంటే వేరైన ఒక ప్రత్యేకమైన శ్రేణికి చెందిన కట్టడాన్ని సూచిస్తుంది.
సమాసాల సౌలభ్యాన్ని ఇంగ్లీషు మేధావులు త్వరగానే గ్రహించారు. ఇప్పుడు
సమాసాలు లేకుండా ఇంగ్లీషు మాట్లాడ్డమే అసాధ్యం. ఒకవేళ అలా మాట్లాడితే
ఇంగ్లీషు రాదేమో నని జాలిపడడం కూడా జరగొచ్చు.

1. Customer-care = care for customers
2. User-friendly = friendly to the user
3. User-serviceable = serviceable by the user
4. Gas dealer = Dealer in gas
5. Expiry date = date of expiry
6. God-forsaken = forsaken by God
7. Bible-thumping = thumping the Bible
8. A London-bound airliner = An airliner bound to London
9. Earth-fill = Filling with earth
10.sky-diving = diving in the sky
11.trustworthy = worthy of trust
12.action-packed = packed with action
13.painstaking/breathtaking etc.

అయితే ఇక్కడ ఒక ఆసక్తికరమైన విషయం ఉంది. తాము వాడుతున్నవి సమాసాలు (word
compounds) అని ఇంగ్లీషువాళ్ళకు ఇప్పటికీ తెలియదు. అలాంటి మిశ్రమాల్లో
మొదటి పదం functional గా adjective అవుతోందని వారు భ్రమిస్తున్నారు. ఆ
మాటే తమ వ్యాకరణాల్లో రాసుకుంటున్నారు కూడా ! రెండు పదాలు
కలుస్తున్నప్పుడు మాయమౌతున్న విభక్తి ప్రత్యయాల (prepositions)ని
వివరించే వైయాకరణ బాధ్యత (grammarian’s burden)గురించి మర్చిపోతున్నారు.

సమాసాలే మన భాషక్కూడా బలం. ఇంగ్లీషు వ్యాకరణాల్లా కాకుండా మన వ్యాకరణం
సమాసాల్ని క్రోడీకరించి వర్గీకరించింది కూడా. అవి మన భాషలో ఇప్పటికే
వందలాదిగా ఉన్నాయి. కాని అవి సరిపోవు. మన భాషకున్న సమాస శక్తిని సక్రమంగా
వినియోగించుకుని చాలా కొత్తపదాల్ని సృష్టించుకునే సౌలభ్యం ఉంది.

9. సందర్భాంతర ప్రయోగాలు : నామవాచకాల్ని క్రియాధాతువులు (programming,
airing, parenting, shopping, modelling, typing, cashing, triggering,
highlighting, focussing మొదలైనవి) గా మార్చి ప్రయోగించడం ఇంగ్లీషుకు ఎంత
ఊపునిచ్చిందో ఇది కూడా అంతే ఊపు నిచ్చింది. సందర్భాంతర ప్రయోగాలంటే-
సాంప్రదాయికంగా ఒక సందర్భంలో మాత్రమే వాడాల్సిన పదాల్ని ఇంకొన్ని ఇతర
సందర్భాలక్కూడా అనువర్తించి వాడ్డం.అలాగే ఒక రంగంలో వాడాల్సిన సాంకేతిక
పదాల్ని ఇంకో రంగానికి ఆరోపించి వాడ్డం కూడా !  ఉదా :- screen (తెఱ)
నాటకాలకూ సినిమాలకూ అన్వయించే మాట. దాన్ని IT లో కొన్ని రకాల పుటల్ని
సూచించడానిక్కూడా వాడుతున్నారు.

అలాగే, campaign కి ప్రాథమికంగా దండయాత్ర అని అర్థం. కాని ఇప్పుడు దాన్ని
ప్రచారయుద్ధం అనే అర్థంలో కూడా వాడుతున్నారు. గుఱ్ఱాల
శారీరాన్ని(anatomy)అందులో భాగాల్నీ కార్లకూ, ఇతర యంత్రాలకూ అన్వయించి
ప్రయోగించడం కూడా జరిగింది.

తెలుగు కూటమి

-భాషోద్యమం కోసం -పారుపల్లి కోదండ రామయ్య  వీరు నెలభై సంవత్సరాల పాటు విద్యుత్ శాఖ లో పని చేసి, పదవీ విరమణ చేసి తెలుగు భాషాభివృద్ధికై నిరంతర కృషి చేస్తున్నారు.

కూటమి పుట్టుక

ఈ దేశంలో మిగిలిన భాషలతో పోలిస్తే, ఎక్కువ మంది మాట్లాడుతుండిన తెలుగు ఇప్పుడు మనుగడ చిక్కులను ఎదుర్కొంటున్నది. బడి మాధ్యమంగా పనికి రాని భాష తెలుగు అని తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలు తేల్చేసాయి. దూరపు ఇతర రాష్ట్రాలలో తెలుగు మాధ్యపు బడులు కొనసాగుతుండటం ఒక వింత. ఈ ప్రభుత్వాల చేష్టలు ఆ బడులకు కూడ ఎసరు పెడతాయి అని అక్కడి మన వారు వాపోతున్నారు. 1953 నుంచి సైతం ఇక్కడ ఏలుబడి భాషగా తెలుగును ఆదరించిన ఒక్క ముఖ్యమంత్రి కూడ లేడు. అసెంబ్లీ చట్టాల భాషగా, న్యాయస్థానాల పరిభాషగా కూడ ప్రజల భాష కనపడని రాష్ట్రాలు మనవే. రాజధానిలోనూ పలుకుబడి భాషగా  పనికి వచ్చేది హిందీ అంటే పరిస్థితిని అర్థం చేసుకోవచ్చు.

ఈ నేపధ్యంలో తెలుగు మనుగడ కోసం కొంత మంది మేధావులు, తెలుగు ప్రేమికులు ఒక స్పష్టమైన కార్యాచరణ పధకంతో ముందుకు పోవాలి అని నిర్ణయించుకున్నారు. దాని కోసం కొంత లోతుగా విషయాలను పరిశీలించాలి. అసలు తెలుగుకు ఈ ముప్పు ఎలా మొదలైంది? ఎందుకు కొనసాగుతున్నది? తెలుగు వారు ఈ విషయమై ఏమి ఆలోచిస్తున్నారు? ఈ ధోరణికి నివారణ మార్గాలు ఏమిటి?

కీడు మొదలు

వింధ్య పర్వతాల క్రింద ప్రాంతమంతటా తెలుగు మాట్లాడేవారు ఉండేవారు. ఇంత ప్రాంతాన్ని ఒకే రాష్ట్రంగా ఉంచటం కుదరదు. అలా వివిధ రాష్ట్రాలుగా ఉంటేనే తెలుగు పరిస్థితి బాగుండేది. కొంత మంది తమ స్వార్థ కారణాల వల్ల తెలుగుకు విడి రాష్ట్రం కావాలని కోరారు. ఆచరణలో తమిళనాడు, కర్ణాటక అని పేరు పెట్టి వదిలిన ప్రాంతాలలో తమిళుల, కన్నడిగుల కన్న ఎక్కువ సంఖ్యలో తెలుగు వారు ఉండటం వారి ద్రోహాన్ని బయటపెట్టింది. ఒక్క సారి తమిళుల రాష్ట్రం తమిళనాడు అని ప్రకటించాక అక్కడి మిగిలిన తెలుగులపై వేట మొదలైంది. 1920 ల్లో దక్షిణాన ఉన్న మూడు జిల్లాల తమిళనాడు కావాలని ద్రవిడ కజగం అడగటాన్ని మనం గుర్తుకు తెచ్చుకోవాలి. మైనారిటీ వారిదే రాష్ట్రం అని ప్రకటించాక దానిని విజయవంతంగా వాడుకోవాలంటే ఆధిపత్య ధోరణి అవసరం అని తెలుసుకొని తెలుగును కనపడకుండ, వినపడకుండ చేసి తెలుగు వారిని లేకుండ చేసారు. కర్ణాటకలో కూడ అదే పరిస్థితి. బెంగుళూరులో తెలుగు సేవ చేస్తున్న లక్ష్మీ రెడ్డి గారు తమ పిల్లలు కన్నడిగులు అయిపోయారు, తెలుగు వారమని చెప్పుకోనలేక పోతున్నారు అని చెప్పారు. తెలుగు వారి ప్రాంతాలను మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, ఒరిస్సాలలో కూడ వదిలేసాము.1953 లో ఆంధ్ర ప్రదేశ్ ఏర్పడినప్పుడే తెలుగు తల్లికి ఒక కన్ను, ఒక చేయి, ఒక కాలు తీసేశారు. సగం మంది తెలుగు వారు తెలుగు రాష్ట్రం బయట మిగిలిపోయారు. వారు ఇక కనుమూసినట్లే. వివరాల కోసం స. వెం. రాసిన ‘ఎల్లలు లేని తెలుగు” చదవాలి.

నిజంగా తెలుగు కోసం ఏర్పడిన రాష్ట్రం కాదు కాబట్టి ఆంధ్ర రాష్ట్రం ఏర్పాటుతో తెలుగు పతనం మొదలైంది. కనీసం మాట వరసకు అయినా వెంబడే తెలుగును అధికార భాషగా ప్రకటించలేదు. ఎక్కడా ఉండని వింత: పైకి ఇక్కడ రెండు అధికార భాషలు ఉంటాయి. తీరా అలా ప్రకటించిన రెండు భాషలూ ఆచరణలో అధికార భాషలుగా ఉండవు. శాసనాలు, ప్రభుత్వ కార్యాలయాలు, న్యాయస్థానాలు, బ్యాంకులు, విద్యుత్ సంస్థలు, కొట్లు, కంపెనీలలో ఎక్కడ చూసినా తెలుగు కనపడదు. ఇంతగా తల్లి నుడికి అవమానం ఏ దేశంలో, మన దేశంలోని ఏ రాష్ట్రంలో కూడ జరగటం లేదు. దీనికి నెమ్మదిగా అలవాటు పడిన జనం, ఎందుకూ పనికి రాని భాష, తెలుగు అని అనుకొన్నారు. అందుకని తమ పిల్లలను తెలుగుకు దూరంగా ఉంచటం మొదలుపెట్టారు.

ఇప్పటి పరిస్థితి                        

అమ్మకు మందు బిళ్ళ వేసేదెవరు?

ఈ నేల మీద ఎక్కువ మంది పిల్లలను కన్నవారిలో మా అమ్మ ఒకతి. కాని, ఆ 100 మంది పిల్లలలో 90 మందికి డబ్బు సంపాదన యావే తప్ప మరోటి లేదు. వీరు డబ్బు కోసం ఎంత నీచమైన పనికైనా తెగిస్తారు. వీరికి తల్లి అంటే గిట్టదు. ఫలానా తల్లికి పుట్టాము అని చెప్పుకోవటానికే సిగ్గుపడతారు. వారి పిల్లలకు కనీసం నాయనమ్మ మాటను చెప్పటానికి కూడ ఇష్టపడరు. పిల్లల నోట నాయనమ్మ మాట రాకుండ చాల జాగ్రత్తపడుతుంటారు.

తెల్ల తల్లిని తలకెత్తుకొని తమ తల్లిని తన్నుతున్నారు.

ఈ మధ్య విక్టోరియా మహారాణి మా ఊరు వచ్చింది. చాల తెల్లగా ఉన్నది. మొకంలో కళ ఉన్నది. తెలివితో ఆరోగ్యంగా, అందంగా, మంచి గుడ్డలతో ఉన్నది. ఎన్నో విషయాలలో ఎంతో పరిజ్ఞానంతో మాటల చతురతను కలిగి ఉన్నది. వీరు ఇక ఆమెకు వంగి, వంగి దండాలు పెట్టి ఆమె కాళ్ళను పదే పదే ముద్దెట్టుకున్నారు. ఇంటికి వచ్చి తమ తల్లి అలా లేదని రోజూ తన్నుతూనే ఉన్నారు.

యునెస్కో డాక్టరు చూసి “మీ అమ్మ ఎక్కువ కాలం బతకదు” అని చెప్పేసాడు. “I.C.U. లో ఉన్నది. గంటకు ఒక మందు బిళ్ళ దగ్గరుండి నోట్లో వేయాలి” అని చెప్పాడు.

90 మంది ఎలాగూ పట్టించుకోరు. మిగిలిన వారిలో ఏడుగురు అమ్మను గురించి పట్టించుకున్నట్లు నటిస్తారు. ఆమెను గురించి గొప్పగా ఆగకుండా మాట్లాడుతూనే ఉంటారు. కొంత మంది అమ్మ మాటల తీయదనం మీద వ్యాసాలు, కథలు, గీతాలు, పద్యాలు, శతకాలు రాస్తారు. మా అమ్మ మాట తేనె కన్న తీయన అని, జున్ను వెన్నల కన్న మిన్న అని ఉపన్యాసాలు ఇస్తుంటారు. ఆ పుస్తకాల మీద సమావేశాలు, ఒకరికొకరు శాలువాలు కప్పటాలు నిరంతరం చేస్తూనే ఉంటారు. అమ్మ కోసం ఎంతో చేసినట్లు చెమటలు కారుస్తుంటారు. కాని అమ్మ దగ్గరకు వెళ్లి నోట్లో మందు బిళ్ళ వెయ్యాలనే వీరికి తోచదు, వేరే వారు చెప్పినా రుచించదు.

మిగిలిన ముగ్గిరిలో ఇద్దరు మాత్రం గట్టిగానే అనుకున్నారు; తప్పకుండా తల్లి కోసం ఏమైనా చెయ్యాలి అని. అందుకని వీరు బాగ ఆలోచించి పైనున్న జగన్మోహనుని, చంద్రులను ప్రార్థించాలి అని అంటున్నారు. వారికి స్తోత్రాలు రాస్తున్నారు. వారి మనసు కరిగే దాక ప్రార్థనలు, ఊరేగింపులు, పూజలు, కొలుపులు చేయాలి అనుకున్నారు. దాని కోసం కొన్ని సంఘాలను, ప్రార్థన సమావేశాలను ఏర్పరుస్తున్నారు. ఇంతకూ ఇందులో ఒక్కరు కూడ తల్లి దగ్గరకు వెళ్లి ఒక్క మందు బిళ్ళను ఆమె నోట్లో వేయాలని మాత్రం అనుకోవటం లేదు.

ఇక మిగిలిన ఒకాయన మాత్రం, ‘మా బజారు అవతలి బజారులోని చివరి ఇంట్లో ఒకామెకు ఒంట్లో బాగా లేదు. ఆమెకు కంట్లో నలుసు పడినా, పంట్లో నొప్పి వచ్చినా నేను తట్టుకోలేను. ముందు ఆమె బాగోగులు చూడాలి.’ అని అక్కడకు వెళ్లి ఆమె సేవలో మునిగి తేలుతున్నాడు. సవర అక్షరాలను కనిపెట్టాడు. వారికి ఒక తెల్లడి (dictionary) రాసాడు. పుస్తకాలను తయారు చేసాడు. ‘తెలుగును మానెయ్యండి, సవర భాషను నేర్వండి’ అని చెప్పాడు. ఆదిలాబాదు జిల్లాలోని గోండుల దగ్గరకు వెళ్ళాడు. వారి భాషకు అక్షరాలను కనిపెట్టాడు. పుస్తకాలను రాసాడు. ఐ.టి.డి.ఏ. ద్వారా చదవటానికి మొత్తం ఖర్చులకు ఏర్పాట్లు చేసి, జేబుడబ్బుల సౌకర్యం కలిగించి ‘ఇక తెలుగు చదవకండి.’ అని చెప్పాడు. తెలుగునాట కన్న ఎన్నో రెట్లలో గోండులు ఇతర రాష్ట్రాలలో ఉన్నారు. మహారాష్ట్ర లోని వారి దగ్గరకు పోయి ‘మరాఠీ మాని, గోండు నేర్వండి.’ అని, మధ్యప్రదేశ్, చత్తీస్ గడ్ పోయి ‘హిందీ మాని, గోండు నేర్వండి’ అని కూడ అంటే అది ఒక ధోరణిలే అనుకొనవచ్చు. మరి వీరికి పొరుగు రాష్ట్రాలలో తల్లి నుడికి దూరమవుతున్న, దూరమైన తెలుగు వారు ఎందుకు కనపడరు?

ఈ నడుమ పాలమూరు జిల్లా కలెక్టరు అక్కడి ఇటుక బట్టీలలో పనిచేస్తున్న చదువు రాని, 14, 15 ఏండ్లున్న ఒరిస్సా పిల్లలను చూసి చలించిపోయాడు. ప్రభుత్వ ఖర్చుతో వారికి బడి పాఠాలు నేర్పిస్తున్నాడు ఒరియా భాషలో. కాని 45% గా ఉన్న ఇక్కడి నిరక్షరాస్యులు ఆయనకు కనపడరు. తెలుగు తల్లికి కాన్సర్ కణం ఎక్కించటానికి మాత్రం ఉబలాటపడతాడు.

ఇంత లేకిగా తల్లిని చూసే కుటుంబం ఎక్కడా లేదు.

మా పక్కింటి తల్లుల మహర్దశ

కేరళ ముఖ్యమంత్రి కూడ అక్కడికి వచ్చిన, చదువు రాని, ఒరిస్సా పిల్లలను చూసి నోచ్చుకొన్నాడు. 20 ఏండ్ల క్రిందనే 100 నూరం అక్షరాస్యత సాధించిన తన రాష్ట్రంలో ఈ పరిస్థితి బాగుండదు అనుకొన్నాడు. అందుకని ఆ పిల్లలకు ప్రభుత్వ ఖర్చుతో పాఠాలు నేర్పిస్తున్నాడు మలయాళంలో. ఆరు నెలలలో వారు మలయాళం మాట్లాడతారు. ఒక తరం అక్కడే ఉంటే వారు మలయాళీలు అవుతారు.

ఏడు తరాల క్రితం ఇక్కడకు వచ్చిన మార్వాడీలు తెలుగు రాకుండానే విజయవంతంగా తమ వ్యాపారాలను చేసుకుంటున్నారు. కొద్ది స్వాభిమానం కూడ లేని మనము వారి కొట్లకు వెళ్లి పెంపుడు కుక్కల్లా వారి కాళ్ళు నాకుతూ వచ్చీ రాని హిందీలో మాట్లాడుతూ వారి సరుకులను కొంటాము. వారు మనకు హిందీని నేర్పుతున్నారు. కొట్టు దగ్గరకు వెళ్లి మనము తెలుగులో మాట్లాడితే, తను తెలుగు మాట్లాడలేను అంటే, మేము వేరే కొట్టు దగ్గరకు వెళ్తాము, అని అనగల స్వాభిమానం మనకుంటే వారందరు 6 నెలల్లో తెలుగులో మాట్లాడతారు. తమిళనాడులో కొట్టు పెట్టిన మార్వాడీ మొదటి రోజు నుంచే అరవంలో మాట్లాడతాడు.

మా పక్కింటి ఆమె తన పిల్లలకు జల్లికట్టు ఆటను నేర్పింది. ఎద్దు మీదకు ఒకతను వెళ్లి దానిని పడవేయటమే ఆ ఆట. అందులో మనిషి ఒక్కొక్క సారి గాయాల పాలవుతాడు. దాదాపు ఎద్దుకు ఎప్పుడూ ఏమీ కాదు. ఇటువంటి ఆట ఒకటి స్పెయిన్ లో బుల్ ఫైట్ అనే పేరు బెట్టి ఆడతారు. ప్రపంచ పర్యాటకులు అందరూ దానిని చాల సంతోషంగా చూస్తారు. మన దేశపు ఉన్నత న్యాయస్థానంలో ఒకరు ఈ ఆట మంచిది కాదు, ఆపండి అని నివేదించారు. దరిమిలా న్యాయస్థానం  జల్లికట్టు ఆడకూడదు అని తేల్చి చెప్పింది. అందుకు నొచ్చుకున్న అరవలు ముఖ్య మంత్రి దగ్గరకు వెళ్లి స్తోత్ర పాఠాలు చదవలేదు. న్యాయస్థానంలో అప్పీల్ చేయలేదు. తమ భాష, సంస్కురుతి మీద కాదు తమ ఆటల మీద వ్యాఖ్యానించినా వారు సహించలేరు. తమ తల్లి నేర్పిన ఆటను మేము ఆడి తీరతాం అన్నారు. ఒకే సారి 19లక్షల మంది ముందుగా అనుకొని  కదిలి ‘మేము రోడ్ల మీద, ఎడ్లతో ఆడితే ఆపే బడ్లు ఎవరో రండి మీ అంతు తేలుస్తాం’ అన్నారు. విశాఖ పట్నంలో ఉన్న 7,000 మంది అరవ పిల్లలు విశాఖలో కూడ ఆ ఉద్యమానికి  అనుకూలంగా ఊరేగింపు తీయటం, అన్ని వీధులు తిరుగుతూ  జల్లికట్టు జై అని అనటం మనం చూసాము. చివరకు జల్లికట్టు ఆడుతున్న ఆ జనాన్ని చూసి ఉన్నత న్యాయస్థానం మౌనంగా ఉండిపోయింది.

తల్లి ఐ. సి. యు. లో ఉన్నా మన వారు మాత్రం మీనమేషాలు లెక్కపెట్టుతూనే ఉన్నారు.

                                      ఉద్యమ కార్యక్రమం

భాష అవసరం అన్ని రంగాలలో ఉంటేనే అది సజీవంగా ఉంటుంది. పద్యాలకూ, కవితలకూ పరిమితమైతే చాలు అనుకొంటే పొరపాటే. బడి, గుడి, రాబడి, ఏలుబడి, పలుకుబడి, సవ్వడి రంగాలలో తెలుగు వాడకం కోసం మనం నడుము కట్టుకొనవలసిన అవసరం వచ్చింది.

దీని కోసం నేల మీద ఎక్కడ ఉన్న వారమైనా కొంత కనీస కార్యక్రమం మీద ఉద్యమించాలనుకొన్నాము. తమ సంస్థల పేరు మీద కాని, వ్యక్తులుగా కాని ఈ పని చేయవచ్చని అనుకున్నాము. కాని దీనికి ప్రత్యెక నిర్మాణం ఉండాలని పెద్దలు ఆంజనేయరెడ్డి గారు సూచించారు. “హై కోర్ట్ ముఖ్య న్యాయమూర్తి దగ్గరికో, ఒక ప్రభుత్వ అధికారి దగ్గరికో మనం వెళ్లి కొన్ని విషయాలను అడిగితే అంత మాత్రాన సరిపోదు. తరువాత వారికి గుర్తు కూడ సక్రమంగా ఉండకపోవచ్చు. తమ క్రింది అధికారులకు తగు ఆదేశాలను ఇవ్వాలన్నా ఒక కాగితం మీద మన కోరికను తెలియచేయాల్సిందే. ఆ పరిస్థితిలో ఒక మనిషి పేరు మీద కన్న ఒక సంస్థ పేరు ఉంటే బాగుంటుంది” అన్నారు. పెద్దలు డా.మిత్ర, జొన్నవిత్తుల రామలింగేశ్వర రావు, గారపాటి ఉమామహేశ్వరరావు , దీర్ఘాసి విజయభాస్కర్, పులికొండ సుబ్బాచారి, టి.గౌరీ శంకర్, ఇతర ఆచార్యులు, చీఫ్ ఇంజనీర్లు, మీడియా మిత్రులు అందుకు ఒప్పుకున్నారు.  కాబట్టి ఉద్యమం కోసం సమావేశమైన మొదటి రోజే దీని మీద చర్చించి మన భాషోద్యమ సంస్థకు తెలుగు కూటమి అని పేరు పెట్టాము.

ఇది ఇప్పటికే ఉన్న వేల ఇతర తెలుగు సంస్థలకు పోటీ కాదు, ప్రత్యామ్నాయం కాదు. ఇది ఉద్యమ పనులను మాత్రమే చేపడుతుంది. ఇతరులు ఇందులో వ్యక్తులుగా పాల్గొనవచ్చును లేదా తమ సంస్థల బాధ్యులుగానే ఇందులో చేరవచ్చును. ఇక్కడ ఉద్యమ కార్యాలలో పాల్గొంటూనే తమ ఇతర కార్యక్రమాలను కొనసాగించవచ్చును. అన్ని ఖండాలలోని తెలుగు ప్రేమికులు ఐక్యంగా ఉద్యమించటానికి ఇది ఒక ఉమ్మడి వేదిక మాత్రమే.

తెలుగును కాపాడుకోవటానికి సామాన్య జనం కదలాలి. బెంగుళూరులో తెలుగు వారి కొట్లకు కూడ తెలుగులో పేరు పలకలను పెట్టనివ్వరు. జల్లికట్టు ఆటకు అరవలు కదిలి రక్షించుకోగలిగారు. మనం కదిలితే మన తల్లిని రక్షించుకొనగలం అన్న సంగతిని మామూలు జనానికి చేరవేయాలి. అందు కోసం వారిని కదిలించాలి.

ఈ మహా ఉద్యమంలో అందరు తెలుగు వారు పాల్గొనాలి. అన్ని మతాల, కులాల, పార్టీల, సంస్థల, ప్రాంతాల ప్రజలను కదిలిస్తేనే మనం విజయం సాధిస్తాం. ముందుగా కొంత కనీస కార్యక్రమాన్ని తీసుకొని కదులుదాం. ఎవరో వచ్చి ఏదో మన కోసం చేసిపెడతారు అనే భ్రమ నుంచి మనం బైటకు రావాలి. మనం కదిలి బజారులోకి వచ్చి సాధించుకోవాలి అనే సంప్రదాయాన్ని స్థాపించాలి.

దీని కోసం మనం నిర్మాణపరంగా కూడ పనులను చేపట్టాలి. ఒక చోట మీరు ఒక్కరే ఉన్నట్లు గమనిస్తారు. మరొక తెలుగు అభిమాని కోసం మీరున్న ప్రాంతం/పట్టణం/దేశం లో వెతకండి. తప్పక దొరుకుతాడు. తరువాత మీ ఇద్దరు కలిసి మరొకరిని వెతకండి. ముగ్గురు అవగానే ఆ ప్రాంతపు తెలుగు కూటమి cell (రవ్వ -శాఖ) ను మొదలుపెట్టండి. ఆ cell ప్రతి నెలకు/పక్షానికి ఒక సారి అయినా ముందే అనుకున్న తేదీ/వారం నాడు తప్పక కలవాలి. అయిపోయిన నెలలో ఏమి చేసారో సమీక్ష జరగాలి; వచ్చే నెలలో ఏమి చేయాలో తేల్చాలి.

ముందుగా మనం చేయగలిగిన పనులను తేల్చుకోవాలి:

కలిసి చేసే పనులకు కొన్ని మచ్చులు:

  1. తెలుగు కోసం చేసిన చట్టాలను ఉల్లంఘించిన చోట్ల స్పష్టమైన ఆధారాలతో న్యాయస్థానానికి వెళ్ళటం. ఇందులో ఏలూరులోని డా. గుంటుపల్లి శ్రీనివాస్ గారు చాల పని చేసారు.
  2. ఉల్లంఘించే అధికారి దగ్గరకు వెళ్లి ఆయన చట్ట వ్యతిరేక చర్యను ఆయనకు వ్రాత పూర్వకంగా ఇవ్వటం.
  3. ఆయన మారకపోతే సమాచార హక్కు చట్టాన్ని వాడటం, పై అధికారికి ఫిర్యాదు చేయటం.
  4. అన్ని మండలాలలోని కూటమి శాఖలు ఒకే సారి ఒక బ్యాంకు/సంస్థను ఎన్నుకొని తెలుగు వాడకం పై ఒత్తిడి తేవటం. దాని కార్యకలాపాలను బహిష్కరించమని వాడకందారులను బలవంతం చేయటం. గేటు దగ్గర అడ్డంగా నిలబడ్డ మనలను ఆ బ్రాంచి అధికారి పిలుస్తాడు. ఆయన గదిలోకి వెళ్లి ఆయనతో మర్యాదగానే మన ఉద్యమాన్ని వివరించాలి. మనం చెప్పాలి: లక్నోలో మీరు ఖాతా తెరిచే కాగితాలను హిందీలో ఇస్తారు. మంగుళూరులో పే ఇన్ స్లిప్ ను కన్నడంలో ఇస్తారు. కన్నడనాట రైలు టిక్కట్లు కూడ కన్నడ భాషలో ఉంటాయి. మదురైలో డి.డి. కోసం దరఖాస్తును తమిళంలో ఇవ్వకపోతే మీ మేనేజర్ను పట్టు పట్టి పదుగురు పరికిస్తుండగానే పట్టుకొని, పట్టపగలే పది పీకి,  పైన పెట్రోలు పోసి, పుల్లగీసి పైకి పంపి పరమ పవిత్రమైన పని, పండుగని తమ పరువును పెంచుకొన్నామని పరవశించి పోతారే! మీరు ఇక్కడ తెలుగులో ఎందుకు కాగితాలు ఇవ్వరు?

తలుచుకుంటే 42 లక్షల జనం ఉన్న చిత్తూరు జిల్లాలో నలుగురిని ఈ పనికి కదిలించగలం. అలానే రెండు రాష్ట్రాల్లో ఒకే సారి 15 చోట్ల ఒకే బ్యాంకు దగ్గరికి వారానికి ఒక సారి వెళ్లి ఆగకుండ వత్తిడి తెస్తే తప్పకుండ మార్పు వస్తుంది. మన అమ్మ నోట్లో మొదటి మందు బిళ్ళపడి కాస్త సరాళించుకొంటుంది.

  • విదేశాలకు వచ్చిన నాయకులను, అధికారులను, రచయితలను అక్కడి మన వారునిలదీయాలి.“ఇంకెన్నాళ్ళు మీరు జనాన్ని మోసం చేస్తారు? మీరు భాషోద్యమంలో ఎందుకు పాల్గొనరు?” అని అడగాలి.
  • ప్రతి సాహిత్య సమావేశం చివరలో భాషోద్యమ తీర్మానం ఉండాలి. తల్లి మాట తేనెల మూట, ఆమె కోసం మంచి చీరె కొన్నాం (పుస్తకం రాసాం) అని ఇంకెన్నాళ్ళు మంచం మీద ఉన్న తల్లిని మోసగిస్తారు? సాహిత్య ప్రక్రియలు కొనసాగుతూనే ఉండాలి; కాని వాటితో సరిపెట్టుకొనే ధోరణిని మాత్రం విడనాడాలి.
  • ముందుగా న్యాయవాదుల సంఘం ద్వారా జిల్లా జడ్జి గారిని కలవాలి. వినతి పత్రాన్ని ఇవ్వాలి. ఓ పది రోజుల తరువాత ఒక తెలుగు అభిమానమున్న మున్సిఫ్ మేజిస్ట్రేట్ ను ఎంచుకోవాలి. ఆయన దగ్గరకు నలుగురు నోటికి నల్లని గుడ్డను కట్టుకొని నాలుగు అట్టలు కట్టుకొని వెళ్లి బయట మౌనంగా నిలబడాలి. అట్టల మీద ౧. తెలుగంటే మీకు ఎందుకు అంత కోపం? ౨. తెలుగు తల్లిని చంపుతారా? ౩. మీరు తెలుగునాట ఉన్నారు. ఇంగ్లండ్, స్కాట్లాండ్, ఐర్లాండ్ లో కాదు. ౪. అయ్యా, తెలుగులో తీర్పులు ఇవ్వండి.   అది చూసి ఓ గుమస్తా న్యాయమూర్తికి చెప్పుతాడు. కాని ఆయన పట్టించుకోరు. పగలు ఆరా తీస్తారు ఇంకా ఉన్నారా అని. ఔను, ఉన్నారు అని గుమస్తా చెప్పుతాడు. సాయంత్రం బయటకు వచ్చేటప్పుడు ఇక పిలుస్తారు. అప్పుడు మనం వినయపూర్వకంగా ఆయన గారెకి విన్నవించాలి: 46 ఏండ్ల క్రిందనే మున్సిఫ్ మేజిస్ట్రేట్ కోర్ట్, సబ్ కోర్ట్, జిల్లా కోర్టులు తెలుగులో తీర్పులు ఇవ్వాలని స్పష్టమైన ప్రభుత్వ ఆదేశం వచ్చింది. న్యాయస్థానంలో క్రిమినల్ పనులు జరుగకూడదు కదా! 36 ఏండ్ల కిందనే ఆవుల సాంబశివరావు గారు తెలుగులో తీర్పులు ఇస్తూనే పోయారే. 2008 లోనే అధికార భాష సంఘం అధ్యక్షులు ప్రతి న్యాయమూర్తికి తెలుగులో తీర్పులు ఇవ్వమని ఒక వినతి పత్రాన్ని ఇచ్చారు. దానితో పాటు 22 తెలుగు తీర్పులను జత చేసారు.  వాటిలో ఆలుమగలు తగాదా పెట్టుకొని న్యాయస్థానానికి వెళ్ళితే విడాకులు ఇచ్చిన తీర్పు, పొలం తగాదాలో ఇచ్చిన తీర్పు, ఉద్యోగి నిర్లక్ష్యంపై తీర్పు వగైరాలు ఉండి అది ఒక గైడ్ లా ఉంటుంది. 222 ఏండ్ల కింద పుట్టిన బ్రౌన్ దొర ఇక్కడకు వచ్చి నేర్చుకొన్న తెలుగులో 190 ఏండ్ల కిందనే వరుసగా తెలుగులో తీర్పులు ఇచ్చుకుంటూ వెళ్ళాడు. ఇప్పుడు మీరు తెలుగులో తీర్పులు ఇవ్వలేకపోతుండటం భావ్యమా?  మీరు తెలుగు తల్లికి న్యాయం చేయండి.

ఇలా ఒకే న్యాయమూర్తి దగ్గరకు, కనీసం 15 జిల్లాలలో, వారానికి ఒక సారి వెళ్లి ప్రాధేయపడితే కొంత మార్పు వస్తుంది అని ఆశ. తల్లి నోట్లో మరో మందు బిళ్ళ వేసినట్లే.

  • మీ పరిస్థితిని పట్టి మీ ప్రాంతానికి వీలైన పనులను మీరు చేపట్టాలి.
  • ఒక కొట్టు పేరు పలకలో తెలుగు ప్రముఖంగా లేకపోతే మీరు దానిని సరిచేయించవచ్చు. దీని మీద కృష్ణమోహన్ గారు చాల విషయ సేకరణ చేసారు.
  • అంతటా చేయగలిగిన పనులను అందరం ఒకే సారి అనుకొని ఒక్కొక్క పనిని చేపట్టుకుంటూ వెళ్ళాలి. ఇంకా వివరాల కోసం ‘తెలుగే గొప్ప భాష’ పుస్తకం (telugukootami.org) లోని కణుపు ౭ ను చూడండి.
  • తెలుగు భాష ఉద్యమ వ్యాప్తి కోసం ఉత్తేజకరమైన పాటలు వ్రాయించాలి.
  • కేంద్ర ప్రభుత్వ కార్యాలయాలకు వెళ్లి ఆ ఆఫీసులకి సంబంధించిన దరఖాస్తులు, ఇతర ఫారాలు తెలుగులో ముద్రించి అందుబాటులో ఉంచాలని కోరాలి.
  • తెలుగు రాష్ట్రాల్లోని తెలుగు పంతుళ్ళను తెలుగు భాష పరిరక్షణ ఉద్యమ కార్యకర్తలగా కదిలించటానికి ప్రత్యేక కార్యాచరణ రూపొందించాలి.
  • ప్రతి నెలలోఒక రోజుని “తెలుగు భాషా దినము“ గా పాటించి ఆ రోజు ఊరేగింపులు, సభలు నిర్వహించాలి. ఆ రోజు ప్రజా ప్రతినిధులను, అధికారులను సభలకు పిలిచి తెలుగు నుడి ఎదుర్కొంటున్న సమస్యలని వారి ముందుంచాలి. ఆ నాటికీ ప్రభుత్వ కార్యాలాయాలలో తెలుగు అమలు తీరుపై నివేదికలు తెప్పించుకొని సభ ముందుంచాలి.
  • అదే సభలో తెలుగులో రూపొందిన కొత్త పదాలను చర్చకు పెట్టవలెను.
  • ఆ సభలో ఆ ఊరి వ్యాపారస్తుల్ని పిలిచి పేర్ల పలకల గురించి చర్చించాలి.
  • ఇవన్నీ జరగాలంటే ముందు జిల్లా స్థాయి కూటములు ఏర్పాటు కావాలి. ఇప్పుడు చురుకుగా పనిజేస్తున్న వారిని ఇందుకు బాధ్యులుగ చేయవచ్చు.
  • ఏ ఉద్యమం సాగాలన్నా కొంత నిధి అవసరం ఉంటుంది. తర్వాత కూటమి సమావేశాలలో ఈ విషయాన్ని చర్చించాలి.
  • అన్ని రంగాలలో పని చేస్తున్న తెలుగు వారిని కలిసి ఆ రంగాల్లో తెలుగు వాడకం మీద చర్చించాలి.
  • తెలుగు కూటమి కొరకు వలగూటిలో ఏర్పరిచిన telugukootami.org ను అందరికి తెలియజేయాలి.

ఒంటరిగా చేయగలిగిన పనులు

  1. ఇతర దేశాలలో ఉన్న వారు/ఇక్కడి వారు తెలుగుకు జరుగుతున్న అన్యాయాలపై సంబంధించిన నాయకుడికి లక్షల్లో emails పంపాలి. పోస్ట్ కార్డులు, రాయాలి. జనం ఉవ్వెత్తున కదులుతున్నారని తెలిస్తే ఎక్కువ మంది నాయకులు తమ చెడ్డ దారిని వదిలేస్తారు.
  2. మనం కూడ మారిన మనిషిగ అందరికి కనపడాలి. తలెత్తుకొని గర్వంగా తెలుగులో మాట్లాడాలి. ఎదుటి వారిని కూడ తెలుగులో గర్వంగా మాట్లాడమని చెప్పాలి. ఒక కొట్లో తెలుగులో మాట్లాడలేనివారు ఉంటే మరొక కొట్టుకు వెళ్ళాలి. బ్యాంకులలో, ఇతర చోట్లా తెలుగులోనే సంతకం పెట్టాలి. బ్యాంకు నుంచి మీకు ఊసు తెలుగులో ఉండాలి.
  3. కంపెనీ పేరు తెలుగులో రాసిఉన్న కాగితం అంటించిన మంచినీళ్ళ సీసానే కొనాలి. 3.5 కొట్ల తెలుగు వారు whatsapp లో చురుకుగా ఉన్నారని అంచనా. వివిధ మాధ్యమాల ద్వారా తెలుగు వారిని కదిలించి ఈ చిన్న విజయాన్ని సాధించినా మనకు మన మీద నమ్మకం ఏర్పడుతుంది. మిగిలిన వారు కూడ మనం కదిలితే తల్లిని కాపాడుకొనగలమని తెలుసుకుంటారు. వీవెన్ గారి దగ్గర చాల వివరాలు ఉన్నాయి.
  4. ఓ కె లాంటి ఊత పదాలను వాడకూడదు. సరే అనమని చెప్పాలి. చేపలికి అంకెను కూడ తెలుగులోనే చెప్పాలి, ఎదుటివారిని చెప్పమని కోరాలి.
  5. మన కంప్యూటర్లు, ఫోన్లలో తెలుగు కనపడాలి.

నిజంగా తెలుగు కోసం తపన ఉన్న వారు ఈ పుస్తకాలను చదవాలి:

తెలుగు రాష్ట్రాల్లో భాషా సంక్షోభం, తెలుగే గొప్ప భాష, ఒక తెలుగు కథ, తెలుగు దైవ భాషే, మాతృభాషే న్యాయం, బంగారు నాణేలు. ఈ పొత్తాలను మీరు telugukootami.org నుంచి దింపుకొనవచ్చు.

అన్ని ఖండాల అభిమానులు రచ్చబండలో చర్చించి, ముందుకు కదిలిన ఉద్యమకారులకు మెచ్చుకోళ్ళతో పాటు కాన్కలను ఈ విధంగా ఇవ్వాలి అని నిర్ణయించారు:

కొట్ల/కార్యాలయాల పేరు పలకల మీద తెలుగులో  రాయించినవారికి 5,000 రూ., ఉద్యమ పాట రాసినవారికి 5,000 రూ., నినాదం రాసిన వారికి 500 రూ., ఉద్యమ పద్యం బాగా పాడిన చిరంజీవికి 500 రూ., తీర్పరితో తెలుగులో తీర్పు ఇప్పించిన వారికి 5000 రూ.ప్రభుత్వ / ప్రభుత్వ రంగ సంస్థల కార్యాలయాలలో తెలుగు వాడకం మొదలు పెట్టిన వారికి 5,000 రూ.,  న్యాయస్థానంలో విన్నపాన్ని తెలుగులో ఇచ్చి వాదనలు కూడ తెలుగులో కావాలి అని కోరినవారికి 2,116 రూ., సమాచార హక్కు చట్టం ద్వారా తెలుగు కోసం పని చేసి సాధించిన ఉద్యమకారునికి 5,000 రూ., భాగ్యనగరంలో తెలుగును ఒక విషయంగా కూడ చెప్పని బడులను అధికారి దృష్టికి తెచ్చి తెలుగును చెప్పించటం మొదలు పెట్టించిన వారికి 5,000 రూ. కాన్కలు ఇవ్వటానికి నిర్ణయించాం. కాని వారు ముందుగా telugukootami.org లో తాము చేయబోయే పనిని తెలియజేయాలి; రవీంద్రనాథ్ (94408 01883) గారితో మాట్లాడాలి. ఇందులో శ్రీయుతులు తాళ్ళూరి జయశేఖర్, నరసింహప్ప, ఆంజనేయరెడ్డి లాంటి పెద్దలు మనకు వెన్నుదన్నుగా ఉన్నారు.

వెంకయ్య నాయుడు గారు, రమణ గారు, చిన జియ్యర్ స్వామి గారు లాంటి వారు కూడ తెలుగు ఉద్యమం ప్రతి పల్లెకు చేరాలి అంటున్నారు. ఈ నేపధ్యంలో 30 తెలుగు సంఘాలు కలిసి తెలుగు సంఘాల ఉమ్మడి వేదికగా ఏర్పడటానికి నందిని సిధారెడ్డి గారి లాంటి వారు పాటుపడ్డారు. ఇప్పుడు జిల్లాల స్థాయిలో కూడ వేదికల కోసం కదలాలి.

తెలుగులో బడి చదువుల మీద సరియైన అవగాహన ఉంటే, పిల్లలు తెలుగులో చదువవలిసిన అవసరాన్ని తల్లులకు మనం నమ్మకంగా చెప్పి ఒప్పించగలం. దీని కోసం ఒక చిన్న పుస్తకాన్ని త్వరలో నందివెలుగు ముక్తేశ్వర రావు గారు, వి. బాలసుబ్రహ్మణ్యం లాంటి వారి సహకారంతో తయారు చేసుకోవాలి. ఎక్కువ మంది పిల్లలు/తల్లిదండ్రులు ఉన్న చోట్లకు గారపాటి ఉమామహేశ్వర రావు గారిని పిలిచి మాట్లాడించాలి.

మీ ఆలోచనలను, మీ దగ్గర తెలుగు ఉద్యమంలో వచ్చిన ఇబ్బందులను, సాధించిన విజయాలను పంచుకుంటూనే ఉండండి.

తెలుగు సంఘాల ఉమ్మడి వేదిక పేరిట 30 తెలుగు సంఘాలు కలిసి ప్రతి నెల 2వ మరియు 4వ  శనివారాలలో మాపులు 7 గంటలకు జరిపే రచ్చబండలో పాల్గొనటానికి ఈ క్రింది లంకెను మీటండి: తెలుగుపై మీకున్న మమకారాన్ని చూపించుకొనండి.

https://meet.google.com/ste-jdoz-xbs

అందరం కలిసి పనిచేస్తే తప్పక గెలుస్తాం. మనది న్యాయమైన పోరాటం!