ఆనందం అంబరమైన నాడు

సైకిల్‌ మీద తిరిగేవాడు మోటర్‌ సైకిల్‌ కొనాలనీ, మోటర్‌ సైకిల్‌ ఉన్నవాడు కారు కొనాలనీ, కారు ఉన్నవాడు మెర్సిడెస్‌ కొనుక్కోవాలనీ… ఎప్పటికప్పుడు ఇలా లేనిదానికోసం తాపత్రయపడుతూ చాలామంది ఉన్నదానితో లభించే ఆనందాన్ని ఆస్వాదించడం మర్చిపోతున్నారు. జీవితాన్ని మరింత సౌకర్యంగా సుఖంగా జీవించాలనుకోవడంలో తప్పులేదు. కానీ రేపు సాధించే దానికోసం ఈరోజును వృథా చేసుకోవడం తెలివైన పని కాదనీ, వస్తువుల మీద మోజులో పడి అసలైన అనుభూతుల్ని కోల్పోతున్నారనీ గుర్తించారు కొందరు సామాజికవేత్తలు. ప్రజలను ఆ తాపత్రయం నుంచి బయటపడేలా చేయాలని హ్యాపీనెస్‌ క్లబ్బుల్ని పెట్టారు.

 

వారేం తేల్చారంటే… సంతోషంగా ఉండటమనేది సగం మన జన్యువుల మీద ఆధారపడి ఉంటుందనీ, మిగతా సగం మన మెదడులో తయారయ్యే రసాయనాల మీద ఆధారపడి ఉంటుందనీ… కాబట్టే అది మనిషికీ మనిషికీ మారుతోందని తేల్చారు. వారసత్వంగా వచ్చే జన్యువులను ఏమీ చేయలేం కాబట్టి వాటి సంగతి పక్కనపెట్టి మన శరీరంలో తయారయ్యే రసాయనాల సంగతి చూద్దాం.
డోపమైన్‌: పరీక్షలో మంచి మార్కులు వస్తే, ఆటలో మంచి స్కోర్‌ సాధిస్తే, ఒక పని విజయవంతంగా పూర్తి చేస్తే, ఎవరికైనా సాయం చేస్తే… డోపమైన్‌ విడుదలవుతుంది. అంటే మంచి పని చేశావు అని మెదడు మనకు కితాబిస్తుందన్నమాట. అందుకే దీన్ని ‘కెమికల్‌ ఆఫ్‌ రివార్డ్‌’ అంటారు.
ఆక్సిటోసిన్‌: గర్భంతో ఉన్నప్పుడూ పిల్లలకు పాలిచ్చేటప్పుడూ తల్లుల్లో ఎక్కువగా ఉత్పత్తయ్యే ఈ హార్మోన్‌ ఎవరిలోనైనా ఆత్మీయమైన పలకరింపుకీ, ప్రేమపూర్వకమైన స్పర్శకీ స్పందించి విడుదలవుతుంది. అందుకని దీనికి అనుబంధాల హార్మోన్‌ అని పేరు.
సెరొటొనిన్‌: శరీరానికో మనసుకో కాస్త హాయినిచ్చేదేదైనా చాలు సెరొటొనిన్‌ ఉత్పత్తి అవడానికి. అందుకే దీన్ని హ్యాపీనెస్‌ హార్మోన్‌ అంటారు. ఆహ్లాదకరమైన వాతావరణం, నులివెచ్చని సూర్యకాంతి, రుచికరమైన ఆహారం, మంచి ఆలోచనలు… లాంటివన్నీ సెరొటొనిన్‌ని ఉత్పత్తి చేస్తాయి.
ఎండార్ఫిన్లు: శారీరక కష్టం చేసేటప్పుడూ వ్యాయామం చేసేటప్పుడూ విడుదలయ్యే ఎండార్ఫిన్లు శరీరానికి నొప్పుల్ని తట్టుకునే శక్తినిస్తాయి.

హ్యాపీ హార్మోన్లు కావాలంటే…
పైన చెప్పిన నాలుగు హ్యాపీ హార్మోన్లూ ఏయే సందర్భాల్లో విడుదలవుతున్నాయో తెలిసింది కాబట్టి అలాంటి సందర్భాలను రోజువారీ జీవితంలో భాగమయ్యేలా చూసుకుంటే చాలు ఆనందం మీ వెంటే ఉంటుందంటున్నారు మానసికనిపుణులు. అందుకు వారు చెబుతున్న పనులేంటంటే…

మంచి పనులతో…  కొత్త భాష, కళ, క్రీడ… ఎప్పుడూ ఏదో ఒక కొత్త విషయం నేర్చుకుంటూ ఉండాలి. పెద్ద లక్ష్యం ఉంటే దాన్ని చిన్న భాగాలుగా విడదీసుకోవాలి. ఒక్కో దశా దాటి లక్ష్యానికి చేరువవుతుంటే మనసుకి కావలసిన థ్రిల్‌ దొరుకుతుంది. సమస్యలు ఎదురైనప్పుడు తల్లడిల్లిపోకుండా, పరిష్కరించుకునే మార్గం వెతికితే మనసుకి గెలిచిన అనుభూతి లభిస్తుంది. అలాగే ఇతరులకు ఉపయోగపడే మంచి పని చేయడం కూడా. ఏ స్వచ్ఛంద సంస్థలోనో చేరి వారానికో పూట, నెలకో రోజు సేవా కార్యక్రమాల్లో నిమగ్నమవ్వాలి. ఇలాంటి పనులన్నీ డోపమైన్‌ తయారీకి కారణమై మనసును ఆనందంగా ఉంచుతాయి.

బంధాలను బలపర్చుకుంటూ… కుటుంబ సభ్యులు, బంధువులు, స్నేహితులు… దూరంగా ఉన్నవారిని ఇప్పుడు వారితో పనిలేదనో, తీరికలేదనో వదిలేయవద్దు. ఎలా ఉన్నారంటూ ఒక ఫోనుతోనో వాట్సప్‌ సందేశంతోనో పలకరించి బంధాలను ఎప్పటికప్పుడు అప్‌డేట్‌ చేసుకుంటూ ఉంటే ఆక్సిటోసిన్‌ తరచూ విడుదలవుతుంటుంది. కొత్త స్నేహాలూ పరిచయాలూ కూడా అందుకు తోడ్పడతాయి.

ఇష్టమైన పనులతో… మనసు పెట్టి ఇష్టంగా చేసే పని సెరొటొనిన్‌ని ఉత్పత్తి చేస్తుంది కాబట్టి, చేసే పనుల్ని ఇష్టపడి చేయాలి. అప్పుడు ఆటోమేటిక్‌గా పనిలోనే ఆనందమూ లభిస్తుంది. ఇష్టమైన హాబీకి రోజూ కొంత సమయం కేటాయించడం, ఇష్టమైన రుచులను ఆస్వాదించడం, నచ్చిన పుస్తకాలను చదవడం, సంగీతం వినడం… ఏవి చేసినా హ్యాపీ హార్మోన్‌ నిరంతరం విడుదలవుతూ సంతోషంగా ఉంచుతుంది.

ఆటలూ వ్యాయామంతో… ఫీల్‌ గుడ్‌ హార్మోన్లనీ, సహజమైన నొప్పినివారిణులనీ పేరున్న ఎండార్ఫిన్లు విడుదలవ్వాలంటే శరీరానికి వ్యాయామం అవసరం. మానసిక ఒత్తిడీ, నొప్పులూ కూడా వీటి విడుదలను ప్రేరేపిస్తాయి. ఎండార్ఫిన్ల వల్ల పడిన శ్రమ అంతా పోయి మనసుకు హాయిగా ఉంటుంది. అందుకే క్రమం తప్పకుండా వ్యాయామం చేస్తే మానసిక కుంగుబాటు సైతం నయమవుతుందంటారు నిపుణులు. ఇలా హ్యాపీనెస్‌ హార్మోన్లకు నిత్యం పనిపెట్టేలా మన దినచర్యను మలచుకుంటే ఎప్పుడూ ఆనందంగా ఉండడం మనచేతిలోని పనేనని ప్రచారం చేస్తోంది అంతర్జాతీయ ఆనంద దినోత్సవం.

కాసేపు నవ్వాలి!
శరీరం అనారోగ్యంగా ఉంటే మనసు ఆనందంతో కేరింతలు కొట్టడం అసాధ్యం. ఈ రెండూ ఒకదానిమీద ఒకటి ఆధారపడి ఉంటాయి. అందుకని ఆరోగ్యంపై దృష్టి పెట్టాలి. శరీరాన్ని ప్రేమించాలి. అప్పుడే దాంట్లో జరిగే మార్పుల్ని నిశితంగా గమనిస్తాం. ఎలాంటి అనారోగ్య ఛాయలు కన్పించినా వెంటనే జాగ్రత్తపడగలుగుతాం. ఆరోగ్యంగా ఉండే శరీరంలోనే ఆనందంగా ఉండే మనసుంటుంది. ఆ రెండూ కలిసుంటే విజయం బోనస్‌గా వచ్చేస్తుందట. ఇక, పొద్దున్నే వాకింగో వ్యాయామమో చేసి ఆ తర్వాత ఇంటి పనులు చేసుకుని హడావుడిగా ఆఫీసుకెళ్లి, అక్కడ తలెత్తడానికి వీల్లేనంత పనిచేసి, మళ్లీ ఇంటికొచ్చి పిల్లల చదువులూ అవీ చూసుకుని మంచమెక్కేసరికి అర్ధరాత్రి అవుతోందా- అంత బిజీ అయితే మరి నవ్వేదెప్పుడు? అవును… రోజువారీ జీవితంలో ఎంత పని ఒత్తిడి ఉన్నా సరే- ఒక చిన్న బ్రేక్‌ తీసుకోండి. టీవీలో ప్రకటనల్లా ప్రతి పదినిమిషాలకీ అక్కర్లేదు, పొద్దున్న, మధ్యాహ్నం, సాయంత్రం… ఐదేసి నిమిషాలు చాలు. ఓ కార్టూనో, జోకో, కామెడీ సీనో చూడండి. ఆ పూటకి సరిపోయే నవ్వుల హార్మోన్‌ డోసు విడుదలవుతుంది. మనసంతా ఆనందం వెన్నెల్లా పరుచుకుంటుంది.

ఉత్పాదకత పెరుగుతుంది!
ఇంత కష్టపడి ఆనందాన్ని పెంపొందించుకోవాల్సిన అవసరం ఏమిటీ అంటే దానికీ సమాధానం ఉంది. ఆనందంగా నవ్వుతూ తుళ్లుతూ ఉండే ఉద్యోగుల వల్ల సంస్థల్లో 20 శాతం ఉత్పాదకత పెరుగుతుందని సోషల్‌ మార్కెట్‌ ఫౌండేషన్‌ జరిపిన ఓ అధ్యయనం తేల్చింది. అమ్మకాల విభాగంలో సిబ్బంది సంతోషంగా ఉంటే అమ్మకాలు ఏకంగా 37 శాతం పెరుగుతాయట. ఉద్యోగం చేయడానికి మంచి కంపెనీలుగా పేరొందిన టాప్‌ 100 సంస్థల్లో ఉత్పాదకత నిలకడగా 14 శాతం పెరగ్గా, ఇతర కంపెనీల్లో 6శాతమే పెరిగిందట. దాంతో ఇప్పుడు చాలా కంపెనీలు సిబ్బందిని ఆనందంగా ఉంచే కార్యక్రమాలనూ చేపడుతున్నాయి. సంస్థలకే కాదు, వ్యక్తిగతంగానూ ఆనందం లాభమే చేకూరుస్తుంది. సంతోషంగా ఉన్నవారు పనులన్నీ సకాలంలో సమర్థంగా చేయగలగడమే కాదు, వారికి జీవితంలో మధురానుభూతులూ ఎక్కువే ఉంటాయట

Read Full article from https://www.eenadu.net/sundaymagazine/inner_page/12452