కేవలం మన ఆనందంకోసం. – 2008

   ఉద్యోగంసద్యోగం… ఆస్తీపాస్తీ…        ఆనందంగా జీవించడానికి. సగటు మనిషి కోరుకునేవన్నీ అడక్కుండానే ఇచ్చాడు ఆ పైవాడు. కానీ ఎక్కడో వెలితి… ఏదో అసంతృప్తి … ఎందుకు?

కలితో డొక్కలు ఎండుకుపోయినా కాలనీలో కొత్తమనిషి కనిపిస్తే మొరిగే వీధి కుక్కని చూసినా…
ఒంట్లోని జవసత్వాలన్నీ ఉడిగిపోయినా చలికి ఒణుకుతూ గుడిమెట్లమీద అడుక్కునే వృద్ధులు కనిపించినా…
పసితనం ఛాయలు వీడకున్నా చెత్తబండీలాగే కుర్రాడు, చెత్తకాగితాలు ఏరుకునే చిన్నారి… ఎక్కడ వీధి బాలలు తారసపడినా…
అంతెందుకు… నాలుగిళ్లలో పాచిపని చేసే పాపాయమ్మ గుర్తుకొచ్చినా…
చెప్పులు కుట్టే వెంకయ్య తలపునకొచ్చినా…
మనసు మూలల్లో ఏదో కలవరం… సూదితో గుచ్చినట్లుగా పలవరం.
ఎందుకు? అన్నీ సమాధానాల్లేని శేషప్రశ్నలే. ఎప్పటికీ తీరని సమస్యలే. ఇలా నాకు మాత్రమేనా… నాలానే ఎందరో  ఆలోచిస్తూనే ఉంటారు. బాధపడుతూనే ఉంటారు. కానీ సమాజాన్ని మార్చడం తమ ఒక్కరి వల్లా ఎక్కడవుతుందన్న నిస్పృహ. ఫలితం… ప్చ్‌.. అన్న నిట్టూర్పుతోనే సరిపెట్టుకుంటారు. కర్మసిద్ధాంతంతో రాజీపడతారు. అంతేనా… నిజంగా వీటికి సమాధానం, పరిష్కారం లేనే లేవా?
తప్పక ఉంటాయి.
ఎప్పుడు? మనసున్న మనిషిగా ఆలోచించగలిగినప్పుడు… గుండెలోతుల్లో దాగిన మానవత్వాన్ని మేల్పొలపగలిగినప్పుడు…
ఇందుకు మనమంతా సామాజిక కార్యకర్తలమే కానవసరం లేదు. హృదయ వైశాల్యాన్ని పెంచుకుంటే చాలు. మనసున్న మనుషులుగా స్పందిస్తే చాలు… ఏం… అన్నం వండేటప్పుడు గుప్పెడు బియ్యం ఎక్కువ పోస్తే ఆ వీధి కుక్క ఆకలిని తీర్చలేమా? అంతవరకూ ఎందుకు? ఎలాగూ మిగిలే అన్నాన్ని చెత్తబుట్టలో వెయ్యడానికి బదులు ఆ కుక్కని పిలిచి పెట్టలేమా?ఇంట్లోని పాత దుప్పట్లని చలిపులికి ఒణికే గుడిదగ్గర అవ్వకి కప్పలేమా?

చెత్తబండీ లాగే కుర్రాడిని బుగ్గలు పుణికి ముద్దు చేయకపోవచ్చు. ‘నీకీ పని వద్దురా నాన్నా’ అంటూ బడికి పంపించలేమా… ఒక్కరంటే ఒక్కరిని చదివించలేమా?

చెత్త ఏరుకునే చిన్నారుల్ని కనీసం దగ్గర్లోని ఏ స్వచ్ఛందసంస్థకో ఓ ఫోన్‌ చేసి చదువుకునేలా చేయలేమా? ఇంట్లోని పనిమనిషిని మీ బెడ్‌రూమ్‌లో పడుకోబెట్టుకోలేకపోవచ్చు… సాటిమనిషిగా ఆదరించలేమా… ఆప్యాయంగా పలకరిస్తూ ఆప్తబంధువులం కాలేమా? చెప్పులు కుట్టిచ్చే తాతకి చిల్లర డబ్బులతోపాటు ఓ చిన్న చిరునవ్వుతో కూడిన థాంక్స్‌ చెప్పలేమా?

అన్నీ చేయగలం. అవును, మనమే చేయగలం. స్పందించగలం. కానీ చేయం. యాంత్రికత తెచ్చిపెట్టిన బిజీ జీవితంతో బాధపడుతూ ఇంకేదో అనీజీనెస్‌తో సతమతమవుతూ ప్రవాహంలో పడి కొట్టుకుపోతుంటాం.

ఎంతకాలం? ఇంకెంతకాలం?  మనం తినడం, మనం ఎదగడం, డబ్బులు మూటకట్టుకోవడం… ఇది మాత్రమేనా జీవితం. మనం ఎదుగుతూ మరికొందరిని ఎదిగేలా చేయలేమా? ఆసరా అందించలేమా?

ఒక్కసారి ఆలోచించండి… ఆ ఆలోచనను అమలు చేయడానికి ప్రయత్నించండి. ఎప్పుడో ఎందుకు? సకలజనావళి కొత్త సంవత్సర వేడుకలు జరుపుకొంటున్న ఈరోజే మనమూ ఆ పనికి శ్రీకారం చుడదాం. మనని చూసి మరొకరు… వారిని చూసి ఇంకొకరు… మంచితనం పరిమళిస్తే… అంతకన్నా ఏం కావాలి? సమాజాన్ని ఏదో ఉద్ధరించేద్దామని కాదు, ఎవరో ఏదో చేస్తున్నారనో, ఇంకెవరి మెప్పునో ఆశించి కానే కాదు. మన తృప్తికోసం… కేవలం మన ఆనందంకోసం.

( సేకరణ  కోంచెం మార్చి పంచుకోవాలని  ఇలా  :   ) join   www.tmad.org

Advertisements

4 responses to “కేవలం మన ఆనందంకోసం. – 2008

 1. అన్నీ చేయగలం. అవును, మనమే చేయగలం. స్పందించగలం. కానీ చేయం.
  bravo!
  అమృతం కురిసిన రాత్రిలో తిలక్ అంటాడు
  “అలసి నిత్య జీవితంలో సొలసి
  సుషుప్తి చెందారు
  అలవాటునీ అస్వతంత్రతనీ కావిలించుకున్నారు” అని.

 2. మీరు చెప్పింది నిజమండీ, నాకూ ఆ సంతృప్తి అనుభవమే ,నేను ఒక ట్రస్ట్ లో చిన్న పిల్లలకి నాఖాళీ టైం లో చదువు,ఇతర విషయాలు చెప్పడానికి వెళుతుంటాను ,అక్కడ నాకు లభించే సంతృప్తి వెలలేనిది. ఒక గవర్నమెంట్ స్కూల్ లోని ఇద్దరి కి వారి పూర్తి చదువుకి నేను బాధ్యత తీసుకున్నాను వారు కూడా రత్నాలాంటి పిల్లలు బాగా చదువుతున్నారు.
  ఒక ట్రస్ట్ మొదలెట్టే ఆలోచన కూడా వుంది కాని వృత్తిరీత్య ఇప్పుడు కాస్త బిజీ గా వున్నాను

 3. నేను మీతో ఏకీభవిస్తున్నాను. ఒక్కోసారి, ఒకటి రెండు రోజులు పూర్తిగా ఇలాంటి ఆలోచనలతో మనసు కలత చెందుతుంటుంది. మన దేశ శ్రేయస్సు దృష్ట్యా మరే ఇతర ఛారిటీలకన్నా లేని పిల్లలకి మంచి చదువు చెప్పించటం ఉత్తమం. ఈ చెత్త చెదారపు నారాయణ/వికాస్ లలో కాకుండా ఏ సత్యసాయినో లేదా సరస్వతీ శిశు మందిర్ లోనో చదివిస్తే, కాస్త మంచి వ్యక్తిత్వం అలవడుతుంది, పెద్దయ్యాక. విచిత్రమేమంటే, మా నాన్నగారు ఒక ముస్లిం వ్యక్తికి చాలా సహాయం చేసారు, ఆ రోజుల్లో మాకు ఉన్నంతలో. నేను, ఊశ్ వచ్చాక వాళ్ళ కొడుకు మాస్టర్స్ డిగ్రీకి స్పాన్సర్ చేస్తున్నాను. విచిత్రమని ఎందుకన్నానంటే, మాది సాంప్రదాయ బ్రాహ్మణ కుటుంబం. మా చుట్టాల్లోనే ఎందరో ఉన్నారు డబ్బు అవసరమయిన వాళ్ళు, కానీ బాగుపట్టానిక్కాదు వృధాగా ఖర్చుచేయటానికి. అది అపాత్రదానమని మాకు తెలిసి వాళ్ళకి సహాయం చెయ్యలేదు.

  మన హిందువులకన్నా ముస్లిం కుర్రాడిని చదివిస్తే, వాడు ఆవారాగా తిరిగి ఓ తీవ్రవాదిగా మారడని ఓ పిచ్చి ఆశ. అలా అని, మనోళ్ళకి సహాయం చేయనని కాదు. అఫ్కోర్స్, ఆ ముస్లిం వ్యక్తి చాలా మంచి వాడు, సహాయం పొందటానికి. ఈ మత కల్లోలాలు, గొడవలు ఇవి విన్నప్పుడు ఏమనుకోవాలో కూడా తెలియదు.

  ఆశ్చర్యమేమంటే, ఎవరికి వారు మనవరకు, మనము చేసే సహాయం చూసుకొని, ఇతరులకి సహాయం చేసే వాళ్ళెవరున్నారని వాపోతుంటాము గానీ, తరచి చూస్తే, ఒకళ్ళని మించి మరొకళ్ళు ఇతరులకి సహాయం చేసే పనిలో మునిగి తేలుతున్నారని తెలుసుకొన్నాక నోట మాటరాదు. మరింకా దేశం ఇలా ఉందేమిటి అంటే, బహుశా “ఆరే దీపానికి వెలుగెక్కువన్నట్లు”, ఇది వర్తమానపు చెడుకాలానికి అవసానదశేమో.

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s