చెప్పాలని ఉంది..గొంతు విప్పాలని ఉంది

 చెప్పాలని ఉంది..గొంతు విప్పాలని ఉంది
గుండెల్లో సుడులు తిరిగే కలత కధలూఁ..

పాట బాట మారాలని చెప్పటమేనా నేరం
గూడు విడిచిపొమ్మన్నది నన్ను కన్న మమకారం
వసంతాల అందం..విరబూసే ఆనందం
తేటి తేనె పాట..పంచ వన్నెల విరి తోట
బ్రతుకు పుస్తకం లో ఇది ఒకటేనా పుట
మనిషి నడుచు దారుల్లో లేదా ఏ ముళ్ళ బాటాఁ…
మనిషి నడుచు దారుల్లో లేదా ఏ ముళ్ళ బాటాఁ…

చెప్పాలని ఉంది..గొంతు విప్పాలని ఉంది !
చెప్పాలని ఉంది..గొంతు విప్పాలని ఉంది !!

ఏటి పొడుగునా వసంతమొకటేనా కాలం
ఏదీ మిగతా కాలాలకు మరి కాలం?

నిట్టూర్పుల వడగాల్పుల శృతిలో ఒకడూ
కంటి నీటి కుంభవృష్టి జడిలో ఇంకొకడు
మంచి వంచను మోడై గోడు పెట్టువాడొకడు

వీరి గొంతులో కేక వెనుక ఉన్నదే రాగం
అనుక్షణం వెంటాడే ఆవేదన ఏ నాదం
అని అడిగిన నా ప్రశ్నకు అలిగె మత్త కోకిలా
కళ్ళు ఉన్న కబోదిలా..చెవులు ఉన్న బదిరుడిలా
నూతిలోని కప్పలా బ్రతకమన్న శాసనం
కాదన్నందుకు అక్కడా..కరువాయెను నా స్థానం

2 responses to “చెప్పాలని ఉంది..గొంతు విప్పాలని ఉంది

  1. అద్భుతం. ఈ గొంతుక కోసమే నేను పరితపిస్తున్నాను. కవితలెందరో రాస్తున్నారు కానీ “గుండెల్లో సుడులు తిరిగే కలత కధలూఁ..” రాసేవాళ్ళెందరు? నా ఆవేదనా ఇదే
    “వసంతాల అందం..విరబూసే ఆనందం
    తేటి తేనె పాట..పంచ వన్నెల విరి తోట
    బ్రతుకు పుస్తకం లో ఇది ఒకటేనా పుట”
    ప్రేమ, వలపు, విరహం ఇవేనా జీవితం? నా హృదిలోని బాధకు అక్షరరూపంలా వుందీ కవిత. నా బ్లాగులో ఈనాటి (వి)చిత్రాలు లో చెప్పబోయిందికూడా ఇదే.
    “వీరి గొంతులో కేక వెనుక ఉన్నదే రాగం
    అనుక్షణం వెంటాడే ఆవేదన ఏ నాదం”
    ఈ నాదం వినిపించేదే అసలైన రాగం. అందుకు వుండరాదు ఇంకే అనుమానం.
    ఈ చెవిటి లోకం గూబ పగిలేలా పూరించండి శంఖారావం.
    మత్తకోకిల అలిగిందని మానేయకండి మీ రాగం.

    అందమైన పుష్పానికో, స్త్రీకో అలజడి పడి కవిత్వం రాయడం కంటే
    నిట్టూర్పుల వడగాల్పుల శృతిలో,కంటి నీటి కుంభవృష్టి జడిలో,మంచి వంచను మోడై గోడు పెట్టువాడి గురించి స్పందించి రాసిన కవిత్వమే కవిత్వం.

    — ప్రసాద్
    http://charasala.wordpress.com

Leave a comment